17/04/2026
ఈ ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నాము.. కానీ...
రాజమహేంద్రవరం నగరానికి అవుటర్ రింగ్ రోడ్ (ORR) ఎందుకు అవసరం?
1. నగరం ఈశాన్య దిశగా విస్తరణ: నగరం వేగంగా ఈశాన్య దిశలో విస్తరిస్తోంది. ఈ విస్తరణకు అనుగుణంగా ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక అవసరం.
2. ట్రాఫిక్ మళ్లింపు: కోల్‌కతా–చెన్నై (NH-16), రాజమండ్రి–రావులపాలెం–గుండుగొలను (NH-216A), రాజమండ్రి–విజయనగరం ఏజెన్సీ హైవే (NH-516E), రాజమండ్రి–ఖమ్మం–సూర్యాపేట (NH-365BG), రాజమండ్రి–కాకినాడ ADB రోడ్డు మరియు ఇతర జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా వచ్చే భారీ వాహనాలను నగరంలోకి రానీయకుండా బయటి నుంచే మళ్లించాలి.
3. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు: తొర్రేడు, బూరుగుపూడి, వెలుగుబంద, పల్లకడియం, కానవరం, శాటిలైట్ సిటీ, వేమగిరి వంటి శివారు ప్రాంతాల్లో భారీ స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల వల్ల ట్రాఫిక్ గణనీయంగా పెరుగునుంది. ఈ పెరుగుదలను నగరం తట్టుకునేలా ముందస్తు ప్రణాళిక అవసరం.
4. విమానాశ్రయ అనుసంధానం: సమీప పట్టణాలు, నగరాల నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మెరుగైన రహదారి అనుసంధానం అవసరం.
5. భవిష్యత్ అభివృద్ధి: హావెలాక్ బ్రిడ్జ్ పర్యాటక అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, జూ పార్క్, కాకినాడ SEZ పోర్ట్, రాబోయే పరిశ్రమల పార్కుల నేపథ్యంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించి నిర్వహించాల్సిన అవసరం ఉంది.
రాజమహేంద్రవరం అవుటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన స్వాగతార్హమైనది. అయితే, అవుటర్ రింగ్ రోడ్‌ను విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6-లేన్ NH-16 ప్రాజెక్టుతో సమన్వయం చేసి అమలు చేస్తే, నగర ప్రజలకే కాకుండా జాతీయ రహదారి వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.
రాజమహేంద్రవరం అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించవచ్చు : రాజమహేంద్రవరం సిటీ నార్త్ బైపాస్ + రాజమహేంద్రవరం సిటీ ఈస్ట్ బైపాస్.
1. రాజమహేంద్రవరం సిటీ నార్త్ బైపాస్ : రాజానగరం → ఎయిర్పోర్ట్ → బుచ్చెంపేట → మిర్తిపాడు → బొబ్బిల్లంక → కొత్త గోదావరి వంతెన → దేవరపల్లి
ఈ మార్గం ద్వారా ప్రస్తుతం నగరం గుండా వెళ్లే కోల్‌కతా–చెన్నై NH-16 ట్రాఫిక్‌ను నగరం వెలుపల నుంచే మళ్లించవచ్చు. ఇందుకోసం గోదావరి నదిపై కొత్త వంతెన నిర్మాణం అవసరం. అయితే, ఇంతటి భారీ ప్రాజెక్టును RUDA లేదా రాష్ట్ర ప్రభుత్వం భరించడం కష్టం.
ప్రస్తుతం NH-16 రాజానగరం–దివాన్‌చెరువు–కాతేరు మార్గంగా నగరంలో గుండా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం–రాజమహేంద్రవరం విభాగం మాత్రమే ఇంకా 4-లేన్‌గా ఉంది; మిగతా భాగం 6-లేన్‌గా విస్తరించబడింది. విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6-లేన్ NH-16 ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం నగర పరిధిలోని రాజానగరం–దివాన్‌చెరువు విభాగాన్ని మాత్రమే 6-లేన్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల దివాన్‌చెరువు–కొవ్వూరు విభాగంపై తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 4-లేన్ గామన్ బ్రిడ్జ్ (కాతేరు–కొవ్వూరు)ను 6-లేన్‌గా విస్తరించడం సాధ్యం కాదు. దీంతో ఈ విభాగం మొత్తం NH-16 మార్గంలో శాశ్వత బాటిల్‌నెక్‌గా మారుతుంది.
ప్రస్తుతం ఉన్న రాజానగరం–దివాన్‌చెరువు–కాతేరు NH-16 కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే ప్రధాన నివాస, వాణిజ్య, విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. తొర్రేడు, బూరుగుపూడి, వెలుగుబంద, పల్లకడియం, కానవరం ప్రాంతాల్లో 50,000 కంటే ఎక్కువ గృహ స్థలాలు కేటాయించబడ్డాయి. జనాభా వేగంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నా NH-16 మార్గంపై ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. ఈ మార్గంలో Zoo Parkను కూడా ప్రతిపాదించారు.
గోదావరి మీద కొత్త వంతెన లేకుండా NH-16 ట్రాఫిక్‌ను ORR వైపు మళ్లించడం సాధ్యం కాదు. విశాఖపట్నం–రాజమహేంద్రవరం 6-లేన్ NH-16 ప్రాజెక్టులో నగర బైపాస్ లేకుండా కేవలం రహదారి విస్తరణ మాత్రమే చేస్తే, నగర ప్రజలు సర్వీస్ రోడ్లను మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది, ఎందుకంటే కొత్త హైవేలకు పరిమిత ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి.
RCR (రోడ్-కమ్-రైల్వే) వంతెన మరో 10 సంవత్సరాలు మాత్రమే పనిచేయగలదని అంచనా. భద్రతా సమస్యల కారణంగా RTC బస్సులు, ప్రైవేట్ బస్సులు మరియు భారీ వాహనాలను ఇప్పటికే రోడ్-కమ్-రైల్వే వంతెనపైకి అనుమతించడం లేదు. దీని ఫలితంగా గామన్ వంతెనపై ట్రాఫిక్ భారం పెరిగింది.
RCR వంతెన మూసివేయబడితే, గామన్ వంతెన అధిక భారాన్ని ఎదుర్కొంటుంది. ఇది తీవ్రమైన రద్దీకి దారితీస్తుంది మరియు ప్రమాదాల అవకాశాన్ని పెంచుతుంది. నగరంలో NH-16 పై జరుగుతున్న తరచూ ప్రమాదాలు ప్రత్యేక నగర బైపాస్ అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
కాబట్టి, కోల్‌కతా–చెన్నై NH-16 కారిడార్‌లో భాగంగా, విశాఖ–రాజమహేంద్రవరం 6-లేనింగ్ ప్రాజెక్టులో ప్రత్యేక 6-లేన్ నగర బైపాస్‌తో పాటు గోదావరి నదిపై 6 లేదా 8-లేన్ కొత్త వంతెన నిర్మాణం అత్యవసరం.
సూచించిన NH-16 బైపాస్ లేదా ORR ఉత్తర మార్గం : రాజానగరం → ఎయిర్పోర్ట్ → బుచ్చెంపేట → మిర్తిపాడు → బొబ్బిల్లంక → కొత్త గోదావరి వంతెన → దేవరపల్లి.
ఈ మార్గం ప్రయోజనాలు:
1. కోల్‌కతా–చెన్నై NH-16, రాజమహేంద్రవరం–సూర్యాపేట NH-365BG, రాజమహేంద్రవరం–కాకినాడ పోర్ట్ ADB రోడ్ ట్రాఫిక్‌ను రాజమహేంద్రవరం నగరం మరియు కొవ్వూరు పట్టణం నుండి పూర్తిగా మళ్లించవచ్చు.
2. సుస్థిర మరియు ప్రణాళికాబద్ధ నగర అభివృద్ధికి సహకారం అందుతుంది.
3. RCR వంతెన మూసివేసినా గామన్ వంతెనపై అధిక భారం పడకుండా నివారించవచ్చు.
4. కోల్‌కతా–చెన్నై మధ్య నిరంతర 6-లేన్ అనుసంధానం సాధ్యం అవుతుంది.
5. కాకినాడ నగరం మరియు అనేక ప్రాంతాల నుండి ఎయిర్పోటీ ప్రయాణం సులభతరం.
అందువల్ల, విశాఖపట్నం (అనకాపల్లి) నుండి రాజమహేంద్రవరం (రాజానగరం) వరకు NH-16 6-లేన్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలి. రాజానగరం నుండి దేవరపల్లి వరకు NH-16 సిటీ బైపాస్‌ను ORRతో సమన్వయం చేసి NHAI లేదా MoRTH ద్వారా అమలు చేయాలి. దీని వల్ల RUDA లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు.
2. రాజమహేంద్రవరం సిటీ ఈస్ట్ బైపాస్ : రాజానగరం → పల్లకడియం → శ్రీకృష్ణపట్నం → పుణ్యక్షేత్రం → సంపత్‌నగరం → కడియం → కడియపులంక.
ఈ తూర్పు బైపాస్ వల్ల కలిగే ఉపయోగాలు :
1) దీని ద్వార మండపేట, అనపర్తి, రామచంద్రపురం, యానం, రావులపాలెం, అమలాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం నుండి రాజమండ్రి విమానాశ్రయానికి సులభంగా చేరుకోవచ్చు.
2) భారీ వాహనాలు నగరంలోని ప్రస్తుతం ఉన్న దివాన్ చెరువు-కడియపులంక రాహదారి పై రాకుండా నగర శివారుల నుండి వెళ్లిపోతాయి.
ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో పాటు నగరానికి ఇవి చేయాలి :
1) నగరంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల స్థాపన కోసం ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో భారీగా భూసేకరణ చేయాలి (కలవచర్ల, గాదరాడ, తూర్పు గోనగూడెం, మురారి, రామస్వామిపేట, వడిసలేరు, రంగంపేట, పల్లకడియం, కానవరం, ముకుందవరం, ఎలకొలను, రాధేయపాలెం, తోకాడ, పాతా తుంగపాడు, చైతన్య నగర్). ఔటర్ రింగ్ రోడ్ పూర్తయితే ఈ ప్రాంతంలో భారీగా భూమి రేటు పెరుగుతాయి. అప్పుడూ భూసేకరణ చేయటం కష్టం.
2) గోదావరి పుష్కరాలు 2027 నాటికి నగరంలోని రాజానగరం-దివాన్ చెరువు-కాతేరు NH-16 (18 కి.మీ), దివాన్ చెరువు-మోరంపూడి-కడియపులంక NH-216A (22 కి.మీ) రహదారులను 2 × 40 అడుగుల వెడల్పు గల సర్వీస్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, రహదారి భద్రతా చర్యలతో అభివృద్ధి చేయాలి.
3) RTO వద్ద నిలిచిన ట్రంపెట్ ఫ్లైఓవర్ డిజైన్ సవరించి, ప్రారంభమైన దివాన్ చెరువు ఫ్లైఓవర్ పనులు మరియు మంజూరయ్యిన లాలాచెరువు, ITC, వేమగిరి ఫ్లైఓవర్ల పనులు వేగంగా జరగాలి. వీటితో పాటు నరేంద్రపురం, బొమ్మూరు, కడియపులంక కూడళ్ల వద్ద కూడా ఫ్లైఓవర్లు అవసరం.
4) రైల్వే స్టేషన్లో 7, 8 ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిపాదించాలి. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు త్వరగా జరగాలి.
5) నూతన విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని త్వరగా అందుబాతులోకి తీసుకురావాలి.
6) దివాన్ చెరువు-లాలా చెరువు-కొంతమూరు మధ్య నగరానికి రెండో ఆధునిక బస్టాండ్ నిర్మించాలి.
7) పుష్కరాల నాటికి పుణ్యక్షేత్రం-శ్యామల సెంటర్, షెల్టన్ హోటల్-బొమ్మూరు-సంపత్ నగరం వంటి అనేక మాస్టర్ ప్లాన్ రహదార్లను విస్తరించాలి.